janasena: జనసేనలోకి చేరిన పసుపులేటి బాలరాజు.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్!
- పవన్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు
- ఆయన ఉద్యమంలో భాగస్వామిగా చేరాను
- బాలరాజు చేరికను స్వాగతించిన పవన్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. క్షేతస్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రజా సమస్యలపై పోరాడలేమని పవన్ కల్యాణ్ నమ్ముతారని తెలిపారు. బాలరాజు నిన్న డీసీసీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.
అరకు లాంటి మారుమూల ప్రాంతంలో 150 మంది ప్రతినిధులకు పవన్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారని బాలరాజు వెల్లడించారు. అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యేందుకు జనసేనలో చేరినట్లు తెలిపారు. జనసేనలో చేరడానికి తాను షరతులేమీ పెట్టలేదన్నారు.
పవన్ కల్యాణ్ వంతాడకు వెళుతుంటే మాఫియా మట్టిని వేసి రోడ్డును మూసేసిందనీ, జనసేనతో అవినీతిపరులు భయపడుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. పవన్ కల్యాణ్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. బాలరాజు చేరికతో ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతం అవుతుందని తెలిపారు.