Telangana: నాకు రూ.30 లక్షలు వస్తే.. ఈటల రాజేందర్ అంతా లాక్కున్నారు!: మాజీ డ్రైవర్ మల్లేశ్
- తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా
- దాదాపు 45 రోజులు జైలుకు వెళ్లాను
- నా ప్రాణాలకు ప్రమాదం ఉంది
టీఆర్ఎస్ నేత, మంత్రి ఈటల రాజేందర్ పై పోటీ చేస్తానని ఆయన మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్ తెలిపారు. రాజేందర్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా తాను 45 రోజులు జైలులోనే ఉన్నానని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక తన కష్టాలను చూసిన కొందరు దాతలు.. రూ.30 లక్షలు సాయంగా అందించారని చెప్పారు.
అయితే ఈ మొత్తాన్ని ఈటల రాజేందర్ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలుకు వెళ్లడంతో తన ఉద్యోగం ఊడిందనీ, ఇప్పుడు కూలి పని చేసుకుంటూ జీవితం గడుపుతున్నానని బాధపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.