Telangana: తెలంగాణలో ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్న 11 అసెంబ్లీ స్థానాలివే!
- ఎల్బీనగర్, మలక్ పేట, ఖైరతాబాద్ స్థానాలకు డిమాండ్
- నేడు మహాకూటమి తొలిజాబితా ప్రకటన
- చంద్రబాబుతో భేటీ కానున్న అశోక్ గెహ్లాట్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి మహాకూటమి(ప్రజా కూటమి)గా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. పలువురు అసంతృప్త నేతలు తమకు టికెట్ ఇవ్వకుంటే స్వంతంత్రంగా పోటీ చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. కాగా, పొత్తుల్లో భాగంగా టీడీపీకి 14 సీట్లు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే వాటిలో ఏయే స్థానాలు ఉన్నాయన్న విషయమై క్లారిటీ రాలేదు. తాజాగా వీటిలో టీడీపీకి కేటాయించిన సీట్లలో 11 స్థానాలపై స్పష్టత వచ్చింది. 1. ఖమ్మం, 2. సత్తుపల్లి, 3. అశ్వారావుపేట, 4. మక్తల్, 5. దేవరకద్ర, 6. ఉప్పల్, 7. శేరిలింగంపల్లి, 8. కూకట్‌పల్లి, 9. పటాన్‌చెరు, 10. నిజామాబాద్ రూరల్, 11. కరీంనగర్ స్థానాలు టీడీపీకి దక్కినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు ఖైరతాబాద్, ఎల్బీ నగర్, మలక్ పేట నియోజకవర్గాలను కూడా టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. కాగా ఈ రోజు మహాకూటమి తన తొలిదశ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 12(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణ లో మహాకూటమిలో కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్ కేటాయింపుపై చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూత అశోక్ గెహ్లాట్ ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ కానున్నారు.