Nellore District: నెల్లూరులో వైద్యుడు-ఆసుపత్రి సూపరింటెండెంట్ మధ్య చిచ్చుపెట్టిన పంది!

  • పట్టణంలో పందుల ఏరివేత ప్రారంభించిన మునిసిపల్ సిబ్బంది
  • పందికి తగలాల్సిన పెల్లెట్ బాలుడి కణతలోకి
  • ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

నెల్లూరులో ఓ పంది వైద్యుడు-సూపరింటెండెంట్ మధ్య చిచ్చు రేపింది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. మునిసిపాలిటీ సిబ్బంది పట్టణంలోని పందులను ఏరివేసే పని చేపట్టారు. పెల్లెట్ గన్‌తో వాటి వేటకు బయలుదేరారు. సంతపేట ప్రాంతంలో ఓ పందిని కాల్చే ప్రయత్నంలో పందికి తగలాల్సిన పెల్లెట్ గురి తప్పి ఓ బాలుడి కుడి వైపు కణత కింద తగిలింది. దీంతో బాలుడిని హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

బాలుడిని పరీక్షించిన వైద్యుడు డాక్టర్ పరశురామ్ మెడికో లీగల్ కేసు కింద కేసు నమోదు చేయాలని చెబుతూ బాలుడిని ఎక్స్‌రేకు తరలించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధాకృష్ణ రాజు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికో లీగల్ కేసు కింద కేసు ఎవరు పెట్టారంటూ ప్రశ్నించి దుర్భాషలాడారు. తనకు రూల్స్ తెలుసని, ఆ ప్రకారమే నడుచుకుంటానని పరశురామ్ ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సూపరింటెండెంట్ పరశురామ్‌ను తిడుతూ చేయి చేసుకున్నారు. తనను దుర్భాషలాడడమే కాకుండా, చేయి చేసుకున్న రాధాకృష్ణ రాజుపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ పరశురామ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, పెల్లెట్ తగిలి తీవ్ర గాయాలపాలైన బాలుడికి వైద్యులు ఆపరేషన్ చేసి పెల్లెట్ తొలగించారు. బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

Nellore District
Doctor
Andhra Pradesh
Sarvajana Hospital
Pig
  • Loading...

More Telugu News