Congress: టికెట్ దక్కలేదని విషం మింగిన కాంగ్రెస్ నేత.. తప్పిన ప్రాణాపాయం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-d8644a40c8befc5d76e0e510e7177ed2f227ae5b.jpg)
- టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత
- వేరొకరికి టికెట్ కేటాయించడంతో మనస్తాపం
- మాధవరావు సింధియా విగ్రహం వద్ద విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం
మధ్యప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాంగ్రెస్ నేత విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. గ్వాలియర్‌కు చెందిన కాంగ్రెస్ నేత, జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ అయిన ప్రేమ్‌సింగ్ కుస్వాహ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
దక్షిణ గ్వాలియర్ లేదంటే తూర్పు గ్వాలియర్ నుంచి తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్ఠానం దక్షిణ గ్వాలియర్ సీటును సురేశ్ చౌదరికి కేటాయించింది. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్‌సింగ్ మాధవరావు సింధియా విగ్రహం ఎదుట విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో నేతలు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.