shilpa: డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు.. లైంగిక వేధింపులే కారణమని తేల్చిన సీఐడీ!
- ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకున్న శిల్ప
- శిల్ప సోదరి ఫిర్యాదుతో సీఐడీ అధికారుల దర్యాప్తు
- రవికుమార్, శశికుమార్, కిరీటిలపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్యురాలు శిల్ప ఆత్మహత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఆమె ఆత్మహత్యకు లైంగిక వేధింపులే కారణమని సీఐడీ పోలీసులు నిర్థారించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో పీజీ విద్యనభ్యసిస్తున్న శిల్ప తన స్వగ్రామం పీలేరులో ఆగస్టు 7న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో శిల్ప సోదరి ఫిర్యాదు చేయడంతో సీఐడీ అధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తులో శిల్ప ఆత్మహత్యకు కారకులు ఆమె చదివిన వైద్య కళాశాలలోని పిల్లల విభాగాధిపతి రవికుమార్, సహాయ ఆచార్యులు శశికుమార్, కిరీటి అని వెల్లడైంది.
ఈ ముగ్గురూ తనను లైంగికంగా వేధిస్తున్నారని.. పోలీసులతో పాటు గవర్నర్‌కు అప్పట్లో శిల్ప ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్వీ వైద్య కళాశాల ప్రధానాచార్యులు విచారణ నిర్వహించినప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో వేధింపులు ఆగకపోవడంతో మరింత కుంగిపోయిన శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. శిల్ప ఆత్మహత్యకు కారణమైన రవికుమార్, శశికుమార్, కిరీటిలపై కేసు నమోదు చేసినట్టు సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.