Andhra Pradesh: దుర్గగుడిలో మొమెంటోల కుంభకోణం.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఏఈవో అచ్యుతరామయ్య!
- తనను అన్యాయంగా ఇరికించారని వెల్లడి
- ఈవో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
- ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మొమెంటో కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆలయ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన అసిస్టెంట్ ఈవో అచ్యుతరామయ్య ఈ రోజు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తనను అన్యాయంగా విధుల నుంచి తప్పించారని పిటిషన్ లో పేర్కొన్నారు. కనీసం తన వాదనను కూడా వినలేదనీ, తన సస్పెన్షన్ అక్రమమని వాదించారు. తన సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్ లో ఏపీ దేవాదాయ కమిషనర్ తో పాటు ఆలయ ఈవో కోటేశ్వరమ్మను ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మవారి ఆలయంలో 1,200 మొమెంటోలు కొనుగోలు చేసిన అధికారులు ఆ సంఖ్యను మాత్రం 2,000గా చూపారు. ఆడిటింగ్ లో ఈ వ్యవహారం బయటపడటంతో ఏఈవో అచ్యుతరామయ్య సహా ముగ్గురిని బాధ్యులుగా తేల్చారు. దీంతో వీరిని విధుల నుంచి తప్పిస్తూ ఈవో కోటేశ్వరమ్మ నిర్ణయం తీసుకున్నారు.