tammareddy bharadwaja: ఆపరేషన్ బి (బాబు).. 15 రోజుల్లోగా 30 మంది టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ జోస్యం
- రేపట్నుంచి 15 రోజుల్లోగా ఈడీ, ఐటీ దాడులు
- ప్రధాని కార్యాలయంలో ఉన్న కీలక అధికారి పర్యవేక్షణలో దాడులు
- రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన వరకు వచ్చాయని ఆయన తెలిపారు.
రానున్న 15 రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దాడులు రేపట్నుంచి 15 రోజుల్లోగా జరగవచ్చని చెప్పారు.
విజయవాడలో ఉన్న ఇద్దరు హోటల్ యజమానులు, విజయవాడ దగ్గరలో ఉన్న పెద్ద యూనివర్శిటీ యజమాని దాడులను ఎదుర్కోబోయే జాబితాలో ఉన్నారని తమ్మారెడ్డి తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న టాప్ టీడీపీ నేతలు, బయో ఫర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్న ఓ నేత, మైనింగ్ లో ఉన్న ఒక నేత, రియలెస్టేట్ లో ఉన్న మరో నేత, ఇసుక వ్యాపారంలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు... ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు... ఉత్తరాంధ్ర, నెల్లూరు జిల్లాలకు చెందిన మరో ఇద్దరు మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఒక సంపన్న ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మరో నేత, పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక బిజినెస్ తో సంబంధం ఉన్న ఒక ఎమ్మెల్యే, ఒక సంపన్న ఎంపీపై దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
సీఎం రమేష్ పై ఇప్పటికే దాడులు జరిగాయని... అందువల్ల అతనిపై పెద్దగా దాడులు జరగకపోవచ్చని తమ్మారెడ్డి తెలిపారు. కానీ, ఏదో ఒకటి చేసిన రమేష్ ను కూడా దెబ్బతీస్తారని చెప్పారు. ఏపీ, తెలంగాణలో టీడీపీకి మద్దతుగా ఉన్న పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతాయని... ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వీరంతా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులను తీసుకొస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఒక్క ఏపీలో మాత్రమే జరగడం లేదని... ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధంగా బీజేపీ అడుగులు వేస్తోందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దారుణాలు జరిగినా పట్టించుకోవడం లేదని... ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. కేరళ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే శబరిమల అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేస్తోందని అన్నారు.