Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ ను పొడిగించిన కోర్టు!
- గత నెల 25న ప్రతిపక్ష నేతపై దాడి
- ఆపరేషన్ చేయించుకున్న జగన్
- నిందితుడ్ని విచారిస్తున్న సిట్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి రిమాండ్ ను విశాఖపట్నంలోని కోర్టు పొడిగించింది. ఈ నెల 23 వరకూ నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. జగన్ పై దాడి ఘటన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుతో పాటు అతను పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్ధన్ ను సిట్ అధికారులు విచారించారు. కాగా, ఆరు రోజుల రిమాండ్ ముగియడంతో నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. గత నెల 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది.
శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో జగన్ మెడపై పొడవబోగా, అదృష్టవశాత్తూ కత్తి ఎడమచేతితోకి దిగింది. దీంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ కు బయలుదేరిన జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ దాడి ఘటనపై ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.