Andhra Pradesh: ఓ సివిల్ భూ వివాదంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.. అసలు ఆ భూమి నాది కాదు!: వ్యాపారవేత్త జీపీ రెడ్డి
- ఈ కేసును నా లాయర్ చూసుకుంటున్నారు
- మా డాక్యుమెంట్లు ఒరిజినల్ అని కలెక్టర్లు చెప్పారు
- రాజీ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి
హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసంలో నిన్న అర్థరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఓ సివిల్ భూ వివాదానికి సంబంధించిన కేసులో ఈ దాడులు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారుల తనిఖీలపై జీపీ రెడ్డి స్పందించారు. ఓ భూ వివాదానికి సంబంధించి తనపై కేసు నడుస్తోందని ఆయన తెలిపారు. ఈ కేసు వ్యవహారాలను తన లాయర్ చూసుకుంటున్నాడని వెల్లడించారు.
ఈ భూమికి సంబంధించి తనతో సహా ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోందని జీపీ రెడ్డి పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న భూమి డాక్యుమెంట్లు ఒరిజినల్ వేనని ఇద్దరు కలెక్టర్లు ధ్రువీకరించారని తెలిపారు. ఈ వివాదంలో రాజీ కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ భూమి తనది కాదనీ, తన స్నేహితులు కొందరు దాన్ని కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ లోని రోడ్డు నంబర్ 65లో ఉన్న వ్యాపారవేత్త జీపీ రెడ్డి ఇంటిపై నిన్న రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారెంట్ లేకుండానే తనిఖీలు చేసి ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు యత్నించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అక్కడకు చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. అసలు వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. పోలీసుల వేధింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు వెనక్కి తగ్గారు.