Andhra Pradesh: మా నాన్నను ఏడాదిన్నరగా వేధిస్తున్నారు.. అంతా ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి చేస్తున్నాడు!: జీపీ రెడ్డి కుమార్తె శైలజ
- వారెంట్ లేకుండానే ఇంటికి రాత్రి వచ్చారు
- నాన్నను స్టేషన్ కు తీసుకెళతామన్నారు
- భయం వేసి లగడపాటికి ఫోన్ చేశా
హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారి జీపీ రెడ్డి ఇంట్లో నిన్న అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించడంపై ఆయన కుమార్తె శైలజ స్పందించారు. ఏడాదిన్నర కాలంగా పోలీస్ ఉన్నతాధికారి నాగిరెడ్డి తన తండ్రిని వేధిస్తున్నాడని శైలజ తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎలాంటి వారెంట్ లేకుండా తమ ఇంటిలోకి అధికారులు చొరబడ్డారని అన్నారు. వారెంట్ పై ప్రశ్నిస్తే.. ‘వారెంట్ లేదు.. గీరెంట్ లేదు.. మీ డాడీని స్టేషన్ కు తీసుకుపోతున్నాం’ అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఏం చేయాలో అర్థంకాక భయంతో లగడపాటి రాజగోపాల్ కు ఫోన్ చేసినట్లు శైలజ పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందనీ, కానీ నాగిరెడ్డి చర్యలతో పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తోందని తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. ఓ సివిల్ కేసు విషయంలో జీపీ రెడ్డిని విచారించేందుకే నిన్న రాత్రి ఆయన ఇంటికి వెళ్లామని శ్రీనివాస్ తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిని ఎప్పుడైనా విచారించే అధికారం తమకు ఉంటుందని స్పష్టం చేశారు. జీపీ రెడ్డికి ఆరోగ్య సమస్యలుంటే మరోసారి విచారణ చేపడతామని అన్నారు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెం 65లో ఉన్న జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.