America: చనిపోయిన నెలరోజులకు ఎన్నికల్లో ఘన విజయం.. అమెరికా ఎన్నికల్లో వేశ్యాగృహ యజమాని గెలుపు
- గత నెలలో మృతి చెందిన డెన్నిస్ హోఫ్
- నిద్రలోనే మరణించిన వైనం
- డెమొక్రటిక్ అభ్యర్థిపై తిరుగులేని విజయం
అమెరికాలోని నెవడాలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో విచిత్రం చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం మరణించిన వ్యక్తి భారీ మెజారిటీతో గెలుపొందారు. నెవడాలోని 36వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి డెన్నిస్ హోఫ్ (72) రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడ్డారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి లెసియా రోమనోవ్పై విజయం సాధించారు. 68 శాతం ఓట్లు సాధించిన హోఫ్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. అయితే, గత నెలలో ఆయన నిద్రలోనే మరణించారు. వీకెండ్ మొత్తం జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన గత నెల 16న తన నివాసంలో కన్నుమూశారు.
నెవడా రాష్ట్ర చట్టం ప్రకారం.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి చనిపోయినా ఓటింగ్ మాత్రం జరుగుతుంది. అయితే, ఒకవేళ చనిపోయిన వ్యక్తి కనుక గెలుపొందితే ఆ పార్టీకే చెందిన వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. ఐదు వేశ్యాగృహాలకు యజమాని అయిన ఆయన తనను తాను ‘అమెరికన్ పంప్’గా ప్రకటించుకున్నారు. అమెరికాలో ఒక్క నెవడాలోనే చట్టబద్ధమైన వేశ్యాగృహాలు ఉన్నాయి. తన వద్ద ఎంతోమంది వేశ్యలు పనిచేస్తున్నారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.