demonitisation: నోట్ల రద్దు వల్ల ఇన్ని లాభాలు చేకూరాయి: అరుణ్ జైట్లీ
- డబ్బును స్వాధీనం చేసుకునేందుకు నోట్ల రద్దును చేపట్టలేదు
- అక్రమంగా దాచుకున్న డబ్బును వ్యవస్థలోకి తెచ్చేందుకే నోట్ల రద్దు
- పన్ను ఎగవేసిన వారిని చట్టపరంగా శిక్షించాం
పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, యావత్ ప్రజానీకం అనేక ఇబ్బందులు పడిందని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దుపై ఫేస్ బుక్ లో స్పందించారు. డబ్బును స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును చేపట్టలేదని... అక్రమంగా దాచుకున్న డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకునే నోట్ల రద్దును చేపట్టామని ఆయన తెలిపారు.
నల్ల ధనాన్ని బయటకు తీయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ చెప్పారు. విదేశాల్లో ఖాతాలు కలిగిన వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. నోట్ల రద్దుతో అక్రమంగా నిలువ ఉన్న సొమ్మును బ్యాంకులకు రప్పించగలిగామని చెప్పారు. పన్ను ఎగవేసిన వారిని శిక్షించామని తెలిపారు. బ్యాంకుల్లో నగదు పెరగడంతో... అవి పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రాబడి పెరిగిందని తెలిపారు.