maoist: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య.. సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సు పేల్చివేత!

  • నలుగురు అక్కడికక్కడే దుర్మరణం
  • దంతేవాడ జిల్లాలోని బచేలీలో ఘటన
  • కూంబింగ్ ప్రారంభించిన బలగాలు

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఎన్నికల విధుల కోసం వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాల బస్సును ల్యాండ్ మైన్ తో పేల్చేశారు. దంతేవాడ జిల్లాలోని బచేలీ అటవీప్రాంతంలో ఈ రోజు దాడి చోటుచేసుకుంది. గత నెల 30న ఇదే జిల్లాలో మావోలు జరిపిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా బచేలీ ఆటవీప్రాంతంలో వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సు లక్ష్యంగా మావోయిస్టులు శక్తిమంతమైన ముందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ఓ సీర్పీఎఫ్ జవాన్ తో పాటు బస్సు డ్రైవర్, హెల్పర్, కండక్టర్ ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు బస్సు తుక్కుతుక్కుగా మారింది. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అదనపు బలగాలను ఘటనాస్థలానికి పంపారు. కాగా, ఈ విషయమై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన మావోల కోసం గాలింపును ముమ్మరం చేశామని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న 18 నియోజకవర్గాల్లో ఈ నెల 12న, మిగిలిన 72 నియోజకవర్గాల్లో నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఛత్తీస్ గఢ్ లో పర్యటించేందుకు ఒక్క రోజు ముందే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News