Andhra Pradesh: దుర్గగుడి మొమెంటో కుంభకోణం.. తయారీదారుకు నోటీసులు జారీచేసిన పోలీసులు!
- మొమెంటోల సంఖ్యను తప్పుగా చూపిన ఉద్యోగులు
- నలుగురిపై వేటు వేసిన ఈవో కోటేశ్వరమ్మ
- కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో ఇటీవల బయటపడ్డ మొమెంటోల కుంభకోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మొమెంటోలను తయారుచేసిన సంస్థ యజమాని రమేశ్ కు అధికారులు నోటీసులు జారీచేశారు. రేపు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని అందులో సూచించారు. మొమెంటోల తయారీకి వచ్చిన ఆర్డర్ వివరాలు, చెల్లించిన నగదు ఇతర కీలక ఆధారాలతో విచారణకు హాజరుకావాలని చెప్పారు.
దుర్గగుడిలో అమ్మవారి చీరల మాయం వ్యవహారం మర్చిపోకముందే తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన ఈవో కోటేశ్వరమ్మ.. ఏఈవో అచ్యుతరామయ్యతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఈ కుట్రలో పాలుపంచుకున్నారని తేల్చారు. కేవలం 1,200 మొమెంటోలను కొనుగోలు చేసి వాటి సంఖ్యను మాత్రం 2 వేలుగా చూపారని ఆమె గుర్తించారు.
ఈ నేపథ్యంలో నలుగురిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే అచ్యుతరామయ్య తనను బెదిరిస్తున్నారని కోటేశ్వరమ్మ ఫిర్యాదు చేశారు. కాగా, ఈ మొమెంటోల వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు.