gaddar: కేసీఆర్ ను ఢీకొంటున్నా: క్లారిటీ ఇచ్చిన గద్దర్

  • గజ్వేల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా
  • సోనియా, రాహుల్ లను కలసినప్పుడు పాటలు పాడి వినిపించా
  • నాకు భద్రత కల్పించాలని సీఐడీ అడిషనల్ డీజీని కోరాను

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా గజ్వేల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్థానం నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తో భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పారు. మొన్న సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలసినప్పుడు 45 నిమిషాల పాటు పాటలు పాడి వినిపించానని తెలిపారు. 'సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్రసీ' పుస్తకం గురించి వివరించానని అన్నారు.
 
 సీఐడీ అడిషనల్ డీజీని కలిశానని.. తనకు భద్రత కల్పించాలని కోరానని గద్దర్ తెలిపారు. ఇదే విషయమై చీఫ్ ఎలక్షన్ అధికారితో కూడా మాట్లాడానని చెప్పారు. తన ప్రచారంలో భాగంగా... తొలి దశలో ఎస్టీ, రెండో దశలో ఎస్సీ, మూడో దశలో బీసీ, నాలుగో దశలో పేద ఓటర్ల వద్దకు వెళ్లి... వారిలో ఓటుపై చైతన్యం కల్పిస్తానని అన్నారు.

సాధారణ అవినీతి కంటే రాజకీయ అవినీతి అత్యంత ప్రమాదకరమైనదని ఆయన తెలిపారు. తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. శాంతి చర్చల కోసం ఎందరినో కలిశానని...ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా కలిసే అవకాశం ఉంటుందని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాజ్యాంగం, ఈ ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. 

gaddar
elections
Telangana
gajwel
kcr
TRS
ec
  • Loading...

More Telugu News