TRS: లీకులిస్తున్న కాంగ్రెస్... ఒప్పుకునేదే లేదంటున్న సీపీఐ!
- టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి
- ఇంకా తేలని సీట్ల పంపిణీ
- అసహనాన్ని వ్యక్తం చేసిన చాడ వెంకటరెడ్డి
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన నాలుగు పార్టీల మహాకూటమిలో లుకలుకలు ఇంకా చల్లారలేదు. సీట్ల పంపిణీపై లెక్కలింకా తేలకపోగా, కాంగ్రెస్ తో జతకట్టిన సీపీఐ, టీజేఎస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఏ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేయనున్నారన్న విషయమై కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్ర అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. తొమ్మిది సీట్లు కావాలని తాము అడిగితే, ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. తమకు ఎంతో కీలకమైన కొత్తగూడెం స్థానాన్ని తాము వదులుకునేది లేదని అన్నారు.
ప్రాధాన్యత గల సీట్లను ఇవ్వకపోతే కూటమిలో కొనసాగడంపై పునరాలోచించుకోవడం మినహా మరో మార్గం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీట్ల విషయంపై తమ పార్టీ శుక్రవారం నాడు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. కొత్తగూడెం సీటును తమకు ఇస్తామని ఒకసారి, ఇవ్వబోమని ఇంకోసారి కాంగ్రెస్ లీకులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదని ఆయన అన్నారు. మహాకూటమిలో పొత్తు, సీట్ల పంపిణీ కుదరకుంటే, తాము 'ప్లాన్-బీ'ని అమలు చేసి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని అన్నారు.