Donald Trump: మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు పరాభవం.. డెమోక్రాట్ల ఘన విజయం!

  • ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికన్లు
  • రిపబ్లికన్లపై డెమోక్రాట్లదే పైచేయి
  • సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్లదే ఆధిక్యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘోర పరాభవం ఎదురైంది. మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మెజారిటీ స్థానాలను డెమొక్రటిక్ పార్టీ కైవసం చేసుకుంది. సెనేట్‌లో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లు విజయం సాధించారు.

 ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 412 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. 219 స్థానాల్లో డెమోక్రాట్లు, 193 స్థానాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. గతంలో రిపబ్లికన్లు గెలిచిన 26 స్థానాలు కూడా ఈసారి డెమోక్రాట్ల పరం కావడం గమనార్హం. ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోయిన రిపబ్లికన్లు సెనేట్‌లో మాత్రం తమ ఆధిక్యాన్ని నిలుపుకున్నారు.

సెనేట్‌లో 100 స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 31 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. అలాగే, 36 రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగ్గా 33 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాలతో సెనేట్‌లో రిపబ్లికన్ల సంఖ్య 51కి పెరగ్గా, డెమోక్రాట్లు 45 మందికి పరిమితమయ్యారు. గవర్నర్ల విషయంలోనూ డెమోక్రాట్లే ఆధిపత్యం ప్రదర్శించారు. గతంలో కంటే డెమోక్రటిక్ గవర్నర్లు ఈసారి ఏడుగురు పెరిగారు.

Donald Trump
America
Elections
Republicans
Democrats
  • Loading...

More Telugu News