Mizoram: హతవిధీ.. స్థానిక ప్రజల ఆందోళనతో నామినేషన్ వేయలేకపోయిన మిజోరం ముఖ్యమంత్రి

  • సీఈవోను తప్పించాలంటూ ప్రజల ఆందోళన
  • నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సీఎంను అడ్డుకున్న వైనం
  • మరో రోజు నామినేషన్ వేయాలని సీఎం నిర్ణయం

త్వరలో జరగనున్న ఎన్నికల్లో మిజోరంలోని చంపాయ్, సెర్చిప్ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న ముఖ్యమంత్రి లాల్ తన్హవ్లా నామినేషన్ వేయలేకపోయారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని తొలగించాల్సిందిగా కొన్ని రోజులుగా ప్రజలు, పలు ఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సెర్చిప్ నుంచి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సీఎంను  ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఆయన నామినేషన్ వేయలేకపోయారు. దీంతో మరోమారు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల ప్రక్రియలో మిజోరం హోంశాఖ కార్యదర్శి లాల్నున్‌మవయా చువాంగో జోక్యం చేసుకుంటున్నారంటూ సీఈవో ఎస్‌బీ శశాంక్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫలితంగా చువాంగోను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. చువాంగోపై ఫిర్యాదు చేసిన శశాంక్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారంటూ ముఖ్యమంత్రి లాల్ తన్హవ్లా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో భాగంగా ఆందోళన చేస్తున్న ప్రజలు ముఖ్యమంత్రి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా అడ్డుకున్నారు. కాగా, మిజోరంలో ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. నామినేషన్ల గడువు ఈ నెల 9తో ముగియనుంది.

  • Loading...

More Telugu News