Andhra Pradesh: విజయవాడలో జనసేన, టీడీపీల ప్లెక్సీ యుద్ధం.. దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలు!
- పవన్ పై టీడీపీ నేత కాట్రగడ్డ విమర్శలు
- కౌంటర్ గా పోస్టర్లు అంటించిన జనసేన కార్యకర్తలు
- కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసుల నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. టీడీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ జనసేన పార్టీ పేరుతో ఈ పోస్టర్లు నగరంలో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, ప్రభుత్వం లక్ష్యంగా జనసేన పేరుతో తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పిచ్చి ముదిరిన పచ్చకాలం.. ఏం తమ్ముళ్లూ.. వేధిస్తోందా ఓటమి భయం?, గుర్తుకు వస్తోందా పదేళ్ల ప్రతిపక్ష కాలం. 2009లో విజయవాడలో జీరోగా ఉన్న మీరు 2014కల్లా హీరోగా ఎలా మారారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు.
విజయవాడలో విజయం సాధించడం మీ నాయకుడి తంత్ర ఫలమా? లేక మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తెలుగు తమ్ముళ్లకు గోదావరిలో కౌంట్ డౌన్ మొదలయిందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పకుంటే తాము జనసైనికులమే కాదని సవాల్ విసిరారు. ఈ మేరకు జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేశ్ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి.
కాగా, ఇంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు పేరుతో పోస్టర్లు వెలిశాయి. అన్నదమ్ములు కలిసి ప్రజారాజ్యం పేరుతో పోటీ చేసినా 18 సీట్లే వచ్చాయనీ, ఇప్పుడు కొత్తగా ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చురకలు అంటించారు.
1-2 అసెంబ్లీ సీట్లకు మించి గెలిచే సీను, సత్తా జనసేనకు లేవని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ పోస్టర్లకు కౌంటర్ గా జనసేన నేతలు కొత్త పోస్టర్లు, ప్లెక్సీలను అంటించారు. కాగా, ఈ వ్యవహారం చేయి దాటకుండా ఉండేందుకు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని నగర పోలీసులు భావిస్తున్నారు.