Telangana: కేటీఆర్.. పెద్దల వయసును గౌరవించడం నేర్చుకో!: టీడీపీ నేత రావూరి ప్రకాశ్ రెడ్డి
- కేటీఆర్ దిగజారి విమర్శిస్తున్నారు
- హరీశ్ రావును వారసుడిగా ప్రకటించగలరా?
- ఉద్యమం సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎదుటివారి వయసును గౌరవించడం నేర్చుకోవాలని టీడీపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. చంద్రబాబుపై కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ లు తెలంగాణ ప్రజలను మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇప్పుడు మంత్రి హరీశ్ రావును సైతం అదే తరహాలో మోసం చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ కోసం హరీశ్ రావు అహర్నిశలు కష్టపడ్డారనీ, అలాంటి వ్యక్తికి ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావును తన వారసుడిగా ప్రకటించే దమ్ము, ధైర్యం కేసీఆర్ కు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా హరీశ్ రావు పేరును ప్రకటిస్తే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటానని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని గుర్తుచేశారు.