suicide: నాన్నా, నా చావుతో అయినా మారండి.. సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య!
- తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఘటన
- మద్యానికి బానిసైన రామ్ లక్ష్మణ్
- మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య
తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడాన్ని యువకుడు తట్టుకోలేకపోయాడు. తన మరణంతో అయినా తండ్రిలో మార్పు వస్తుందని భావించి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని బొమ్మూరు మండలంలో చోటుచేసుకుంది.
జిల్లాలోని బొమ్మూరులో కొల్లూరి వినయ్ కుమార్(20) ఓ స్కూలులో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే తండ్రి రామ్ లక్ష్మణ్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంపై వినయ్ మనస్తాపానికి లోనయ్యాడు. తరచుగా మద్యం సేవించి తల్లిని వేధించేవాడు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో తాను చనిపోతేనే తండ్రి మారుతాడని భావించిన వినయ్.. బొమ్మూరులోని గోశాల వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. చనిపోయేముందు వినయ్ తన స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
అందులో మాట్లాడుతూ..‘నా చావుకు కారణం నాన్న ప్రవర్తనే. నేను చనిపోయిన తర్వాత అయినా ఆయన మారితే చాలు. నేను చనిపోయానని తెలిస్తే అమ్మ బతకదని భయంగా ఉంది. నాన్నా.. ఇకనైనా అమ్మను బాగా చూసుకో’ అని పేర్కొన్నాడు. కాగా, వినయ్ చాలా మంచివాడని, తండ్రి మారాలని ఇటీవల ద్వారకాతిరుమల కూడా వెళ్లివచ్చాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లి చెట్టు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.