Karnataka: సెటిల్ మెంట్ కోసం 57 కేజీల బంగారం తీసుకున్న గాలి జనార్దనరెడ్డి.. పోలీసుల దాడితో పరారీలో బీజేపీ నేత!

  • అంబిడెంట్ కంపెనీపై కేసుపెట్టిన ఈడీ
  • రంగంలోకి దిగిన గాలి ప్రతినిధులు
  • ఈడీ అధికారులకు రూ.కోటి లంచం

బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. ఓ కంపెనీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ నుంచి కాపాడుతానంటూ గాలి భారీ మొత్తాన్ని స్వీకరించారు. అంతేకాకుండా ఓ ఈడీ అధికారికి భారీగా లంచం ముట్టజెప్పారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు గాలి జనార్దనరెడ్డిని అరెస్ట్ చేసేందుకు బయలుదేరడంతో ఈ మాజీ మంత్రి అదృశ్యమయ్యారు.

బెంగళూరులోని అంబిడెంట్ కంపెనీ విదేశీ పెట్టుబడుల విషయంలో విచారణను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గాలి వర్గీయులు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కంపెనీ 57 కేజీల బంగారు కడ్డీలను రహస్యంగా అందించింది. దీంతో రంగంలోకి దిగిన గాలి జనార్దన రెడ్డి ఓ ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

బెంగళూరు, బళ్లారి, హైదరాబాద్, ఢిల్లీ సహా పలుచోట్ల గాలి జనార్దన రెడ్డి నివాసాలు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. కాగా, ఈ దాడుల గురించి ముందే తెలుసుకున్న గాలి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, లంచం విషయంలో గాలిని త్వరలోనే ప్రశ్నిస్తామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చిన వ్యవహారంలో గాలి జనార్దనరెడ్డికి నోటీసులు జారీచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జనార్దనరెడ్డిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News