Jagan: ‘కోడి కత్తి’ కేసులో మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విచారణ.. 15న మళ్లీ రావాలంటూ ఆదేశం
- శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తేనంటూ నకిలీ కార్డు సృష్టి
- వర్ల రామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు
- పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన జె.శ్రీనివాసరావు, ఆయన సోదరుడు సుబ్బరాజు టీడీపీ కార్యకర్తలేనని చెబుతూ తయరుచేసిన నకిలీ సభ్యత్వ కార్డుల కేసులో మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను పోలీసులు విచారించారు. గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారించారు. వివిధ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావు, ఆయన సోదరుడు సుబ్బరాజు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారని గత నెల 28న జోగి రమేశ్ ఆరోపించారు. వారి ఫొటోలతో ఉన్న టీడీపీ సభ్యత్వ కార్డులను చూపించారు. అయితే, అవి నకిలీ సభ్యత్వ కార్డులని పేర్కొంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా రమేశ్‌కు నోటీసులు జారీ చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారథి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, ఇతర నేతలతో కలిసి జోగి రమేశ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కాగా, రమేశ్‌ను అరెస్ట్ చేయబోతున్నారని అనుమానించిన వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
కాగా, జోగి రమేశ్‌ను అర్బన్ ఎస్పీ వైటీ నాయుడు ఆధ్వర్యంలో వెస్ట్ డీఎస్పీ సౌమ్యలత, అరండల్ పేట సీఐ వై. శ్రీనివాసరావులు విచారించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలను దాటవేశారు. ఇంకొన్నిటికి గుర్తులేదని సమాధానం చెప్పినట్టు తెలింది. దీంతో ఈ నెల 15న మరోమారు విచారణకు హాజరు కావాలని కోరారు.