sabarimal: శబరిమలలో ఘర్షణ.. ఓ టీవీ కెమెరామెన్ కు గాయాలు
- బంగారు మెట్ల వద్దకు చేరుకున్న లలిత అనే మహిళ
- తన వయసు 50 ఏళ్లకంటే ఎక్కువే అని చెప్పినా వినని ఆందోళనకారులు
- ఆధార్ కార్డును చూపించిన తర్వాత.. ఆలయం లోపలకు అనుమతి
శబరిమల ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 18 బంగారు మెట్ల వద్దకు ఓ మహిళ చేరుకుందని తెలియడంతో... అక్కడ కలకలం రేగింది. ఆందోళనలకు కారణమైంది. సదరు మహిళను మెట్ల వద్దకు వెళ్లకుండా... ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓ టీవీ ఛానల్ కు చెందిన కెమెరామెన్ కు గాయాలయ్యాయి.
ఘర్షణకు కారణమైన వివరాల్లోకి వెళ్తే, బంగారు మెట్ల వద్దకు చేరుకున్న మహిళ పేరు లలిత. ఆమె స్వస్థలం కేరళలోని త్రిస్సూర్. తన వయసు 50 ఏళ్ల కంటే ఎక్కువే ఉందని ఆమె పదేపదే చెప్పినా... ఆందోళనకారులు వినలేదు. ఆమె అబద్ధం చెబుతున్నారంటూ అడ్డుకున్నారు. ఆమె ఆలయంలోకి వెళ్లకుండా, ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో, లలితను పోలీసు అధికారులు తమ క్యాంపుకు తరలించారు. ఆమె ఆధార్ కార్డును పరిశీలించిన పోలీసులు... ఆమె వయసు 52 ఏళ్లు అని వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆందోళనకారులు... ఆ తర్వాత శాంతించారు. లలితకు క్షమాపణ చెప్పి, ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించారు.