Prakasam District: బంధువుల పెళ్లికి వచ్చి 40 సవర్ల నగలు దోచేసిన కిలేడీ!
- ప్రకాశం జిల్లా కనిగిరిలో ఘటన
- బంధువుల వివాహానికి వచ్చిన దంపతులు
- బసచేసిన లాడ్జిలో కరెంట్ పోవడంతో దొంగతనం
- విచారించి నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆమె పెళ్లికి వచ్చింది. మిగతా అందరి బంధువులతో కలసి హోటల్ కు అతిథిగా వెళ్లింది. అక్కడ తన బుద్ధిని చూపిస్తూ, ఓ బంధువుకు చెందిన 40 సవర్ల బంగారాన్ని చోరీ చేసి అడ్డంగా దొరికిపోయింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, గత నెల 16న నెల్లూరు చంద్రమౌళినగర్ కు చెందిన కొండారెడ్డి, రమాదేవి దంపతులు కనిగిరిలో జరుగుతున్న బంధువుల వివాహానికి వచ్చారు.
విశ్రాంతి తీసుకునేందుకు వారికి ఓ లాడ్జిలో బస ఏర్పాటు చేయగా, వారి గదిలోనే విశ్రాంతి నిమిత్తం మరికొందరు బంధువులూ వచ్చారు. వారందరూ చూస్తుండగానే రమాదేవి తన నగలను తీసి ఓ బ్యాగ్ లో భద్రపరిచింది. దీన్ని చూసిన తడకు చెందిన తేజశ్రీ అనే మహిళ, కరెంట్ పోయిన సమయాన్ని అదనుగా చూసి, వాటిని కాజేసింది.
మరుసటి రోజు పెళ్లి సమయంలో ధరించేందుకు నగల కోసం వెతుకగా, అవి కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, గదిలోని బంధువులపైనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఎనిమిది మంది మహిళలను విచారించిన పోలీసులు రూ. 8.48 లక్షల విలువైన నగలను తేజశ్రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంతో ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.