Andhra Pradesh: నేనూ రైతు బిడ్డనే.. జగన్ కు ఓటు వేస్తే సంకనాకి పోతారు!: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
- చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టుతో నీళ్లు ఇచ్చారు
- జగన్ కు ముందుచూపు అన్నది లేదు
- మరోసారి టీడీపీని గెలిపించండి
అనంతపురం జిల్లాకు సాగు, తాగునీరు రావాలంటే మరోసారి సీఎం చంద్రబాబును గెలిపించాలని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తానూ రైతు బిడ్డనేననీ, తనకూ రైతన్నల కష్టాలు తెలుసని వ్యాఖ్యానించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీకి ఓటు వేస్తే సంక నాకిపోయినట్లేనని హెచ్చరించారు. రాష్ట్రమంతా బాగుండాలని నాయకులెవరైనా కోరుకుంటారన్నారు. కనీసజ్ఞానం లేకుండా జగన్ పట్టీసీమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించారని విమర్శించారు. అనంతపురంలోని ఉరవకొండలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనంతపురం సహా రాయలసీమ రైతులు చెమటోడ్చి కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా, నీళ్లు లేక నీరసించిపోతున్నారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చిన నేత పయ్యావుల కేశవ్‌ను వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి ముందు చూపున్న నాయకుడి అవసరం రాష్ట్రానికి ఉందని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు విజన్, పట్టుదలతో పాటు ఏపీకి ఏదైనా చేయాలన్న కసి ఉందని వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కలలు కన్న భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ)లో నీళ్లు తీసుకురావడం మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వల్లే సాధ్యమయిందన్నారు.