Andhra Pradesh: ఇక పల్లెల్లోనూ అన్న క్యాంటీన్లు.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం!
- నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు
- ఇప్పటివరకూ పట్టణ ప్రాంతాల్లోనే
- అధికారులకు ప్రభుత్వం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాలలో ఉంటున్న నిరుపేద కార్మికులు, ప్రజల ఆకలి తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్ల’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి ఓ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
అవసరమైన చోట రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిరుపేదలకు రూ.5కే భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లు బాగా సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది జూలై 12న 110 పట్టణాల్లో 124 క్యాంటీన్లను ప్రారంభించారు. వీటి ద్వారా రోజుకు లక్షమంది పేదలకు భోజనం అందిస్తున్నారు.