charlapalli: యాచకురాలి వద్ద రూ.2.34 లక్షల నగదు.. షాకైన జైలు అధికారులు!
- బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
- చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఆనందాశ్రమానికి తరలింపు
- యాచక మహిళను విచారిస్తుండగా బయటపడిన నగదు
యాచకురాలైన ఓ మహిళ వద్ద ఏకంగా రెండు లక్షల 34 వేల రూపాయల నగదు చూడగానే జైలు అధికారులు షాక్‌కు గురయ్యారు. జైలు ఆవరణలోని ఆనందాశ్రమానికి వచ్చిన ఆమెను విచారిస్తున్న సమయంలో డబ్బు మూటలు ఒక్కొక్కటీ బయట పడడంతో అమితాశ్చర్యానికి లోనయ్యారు.
చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎం.ఆర్.భాస్కర్ తెలిపిన వివరాల మేరకు... హైదరాబాద్ మహా నగరంలో యాచకులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా ఈనెల 2న మూసారాంబాగ్ టీవీ టవర్ వద్ద కొందరు బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బిజిలి పెంటమ్మ (72) వీరిలో ఒకరు.
వీరందరినీ శనివారం చర్లపల్లి జైలు ఆవరణలోని మహిళల ఆనందాశ్రమానికి తరలించారు. పెంటమ్మ వివరాలపై జైలు అధికారులు ఆరాతీయగా డబ్బు విషయం బయట పడింది. ఆమె తాను దాచుకున్న చిన్నచిన్న కవర్లు ఒక్కొక్కటీ బయటకు తీస్తుండగా, అందులో పెద్ద పెద్ద నోట్ల కట్టలు ఉండడంతో అధికారులు షాకయ్యారు. మొత్తాన్ని లెక్కించగా 2 లక్షల 34 వేల 320 రూపాయలుగా తేలింది.
అయితే, ఈ నగదుపై పెంటమ్మ కథనం వేరుగా ఉంది. పెంటమ్మకు ఇద్దరు కొడుకులు. భర్త, ఒక కొడుకు చనిపోగా, మరో కొడుకు దేశాలు పట్టిపోయాడు. దీంతో ఆమె కోడళ్ల పంచన చేరింది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 2011లో ఊర్లో ఉన్న ఆమె ఇంటిని అమ్మేశారు. తన వాటాగా వచ్చిన రూ.2 లక్షల్లో లక్ష కోడళ్లు, మనుమలకు ఇచ్చానని, మిగిలిన లక్షతో నగరానికి వచ్చానని పెంటమ్మ చెబుతోంది.
వివరాలన్నీ సేకరించిన జైలు అధికారులు మిర్యాల గూడలోని ఆమె కోడళ్లకు సమాచారం అందించి రమ్మన్నారు. పెంటమ్మ పేరుతో ఎస్‌బీఐలో ఖాతా తెరిచి ఆమె వద్ద ఉన్న నగదును అందులో జమ చేశారు.