Delhi: ఢిల్లీలో సిగ్నేచర్ వంతెన ప్రారంభోత్సవంలో రచ్చ చేసిన బీజేపీ ఎంపీ!
- కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ కార్యకర్తలతో హల్ చల్
- అడ్డుకున్న పోలీసులపై దాడిచేసి రసాభాస
- విపరీత చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్
ఢిల్లీలో సిగ్నేచర్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అతి ప్రవర్తన చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదంటూ ఎంపీ పార్టీ కార్యకర్తలతో అక్కడికి చేరుకుని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై ముష్టిఘాతాలు కురిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతోనూ ఘర్షణకు దిగారు. దీంతో ప్రతిష్టాత్మక కార్యక్రమం రసాభాస అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో యమునా నదిపై రూ.2 వేల కోట్ల వ్యయంతో ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా సిగ్నేచర్ తీగల వంతెనను నిర్మించింది. వజీరాబాద్ వద్ద వెడ్పల్పు తక్కువగా ఉన్న వంతెన ఉండేది. ఈ వంతెనపై గతంలో పాఠశాల బస్సు ఒకటి అదుపు తప్పి నదిలో పడిపోవడంతో 22 మంది విద్యార్థులు చనిపోయారు. దీంతో కొత్త వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నైరుతి ఢిల్లీ నుంచి నగరం మధ్యలోకి చేరుకోవడానికి ఇప్పటి వరకు 45 నిమిషాల సమయం పడుతుండగా, ఈ వంతెన అందుబాటులోకి రావడంతో పది నిమిషాల్లో ఇకపై చేరుకోవచ్చు.
వంతెనలో భాగంగా 154 అడుగుల ఎత్తున పైలాన్ నిర్మించారు. ఇందులో 22 అడుగుల ఎత్తులో సందర్శకులు నగరాన్ని తిలకించేందుకు వీలుగా స్టీల్ గ్లాస్ నిర్మాణం చేపట్టారు. అక్కడికి వెళ్లేందుకు నాలుగు ఎలివేటర్లు నిర్మించారు. ఒకేసారి యాభై మంది వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ గ్లాస్ చాంబర్ నుంచి ఢిల్లీ నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. ఈ పైలాన్ కుతుబ్ మీనార్ కంటే రెట్టింపు ఎత్తైనది కావడం విశేషం.
ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకున్న వంతెన నిర్మాణం ఆలస్యం కావడంతో వ్యయం కూడా అమాంతం పెరిగింది. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో ఆదివారం వంతెనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ తివారి అతి ప్రవర్తన విమర్శలకు తావిచ్చింది. నిర్ణీత సమయానికే వంతెనను ప్రారంభించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తివారి తీరును విపరీత చర్యగా అభివర్ణించారు.