Dubai: అద్భుత ఇన్నింగ్స్... టీ-20లో డబుల్ సెంచరీ!
- దుబాయ్ లో టీ-20 పోటీలు
- 208 పరుగులు చేసిన హరికృష్ణ
- ఐపీఎల్ ఆడటమే లక్ష్యమన్న యువ ఆటగాడు
ఓ టీ-20 మ్యాచ్ లో సెంచరీ సాధించడమే చాలా గొప్ప. అటువంటిది డబుల్ సెంచరీ సాధించడమంటే... ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. దుబాయ్ వేదికగా, స్పోర్టింగ్ క్రికెట్ క్లబ్, మెకోస్ క్రికెట్ క్లబ్ మధ్య టీ-20 లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో యూఏఈ అండర్ 19 ఆటగాడు కేవీ హరికృష్ణ, స్పోర్టింగ్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగి, చెలరేగిపోయాడు.
78 బంతులాడిన హరికృష్ణ, 22 ఫోర్లు, 14 సిక్సర్లతో 208 పరుగులు సాధించాడు. 172 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. దీంతో ఆ జట్టు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని సైతం మెకోస్ జట్టు 17 ఓవర్లలోనే ఛేదించగా, హరికృష్ణను మ్యాన్ ఆధ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం హరికృష్ణ మాట్లాడుతూ, ఇండియాలో జరిగే ఐపీఎల్ లో ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. కాగా, అంతర్జాతీయ టీ-20 పోటీల్లో ఇంతవరకూ డబుల్ సెంచరీ నమోదు కాలేదు. 2013లో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ చేసిన 175 (నాటౌట్) పరుగులే అత్యధిక స్కోరు.