Telangana: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను చేదు అనుభవం.. ఎందుకొచ్చావని నిలదీస్తున్న గ్రామస్తులు!
- కరీంనగర్ లోని మానకొండూరులో పర్యటన
- అడ్డుకున్న వంతడుపుల, కందికట్కూరు గ్రామస్తులు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ, సముదాయించిన పోలీసులు
టీఆర్ఎస్ నేత, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఈ రోజు చేదు అనుభవం ఎదురయింది. ఎన్నికల ప్రచారం కోసం నియోజకవర్గానికి వెళ్లిన ఆయన్ను ప్రజలు అడ్డుకున్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశావని ఓట్లు అడిగేందుకు వస్తున్నావ్? అని ప్రశ్నించారు. దీంతో బిత్తరపోవడం రసమయి వంతయింది.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో రసమయి ఈ రోజు పర్యటించారు. ప్రచారంలో భాగంగా వంతడుపుల, కందికట్కూర్ గ్రామాలకు చేరుకున్న రసమయిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశావని ఇక్కడకు వచ్చావ్? నీకు మళ్లీ ఓటేందుకు వెయ్యాలి? అంటూ ప్రశ్నలు కురిపించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామస్తులపై దాడి చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం రసమయి ముందుకు కదిలారు.