Bihar: ఎన్నో సమస్యలుండగా.. మా అన్నయ్య విడాకులే కావాల్సి వచ్చాయా?: తేజస్వీ ఫైర్
- ప్రజలకు ఉపయోగంలేని దానిపైనే చర్చంతా
- మోదీ, నితీశ్‌లకు కూడా అదే కావాలి
- మహిళా కానిస్టేబుల్ మృతి కంటే తేజ్ ప్రతాప్ విడాకులే ముఖ్యమయ్యాయి
ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లు తమ కుటుంబ విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. కుటుంబ వ్యవహారాల వల్ల కేవలం ఆ కుటుంబంలోని వ్యక్తులపై మాత్రమే ప్రభావం ఉంటుందన్న ఆయన.. దీనిని కూడా ప్రధాని, సీఎంలు విడిచిపెట్టడం లేదన్నారు.
తన భార్య నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ తేజ్ ప్రతాప్ యాదవ్ కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బీహార్‌లో ఇదే చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన తేజస్వీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాకపోయినా ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. చివరికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా విడిచిపెట్టడం లేదని ఆరోపించారు.
పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ సమావేశంలో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. మీడియా కూడా తన సోదరుడి వైవాహిక బంధం విచ్ఛిన్నం గురించే మాట్లాడుతోందని ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ మృతి చెంది పోలీసులు దాడి చేసుకున్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా తమ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడం బాధాకరమన్నారు.
మహిళా కానిస్టేబుల్ మృతి చాలా తీవ్రమైన ఘటనని, శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని పేర్కొన్న ఆయన ఉదయానికి చాలా సీరియస్ అంశమైన మహిళా కానిస్టేబుల్ మృతిని మధ్యాహ్నానికి అందరూ మర్చిపోయారని, తమ కుటుంబంలో ఏం జరుగుతోందనేదే చర్చనీయాంశమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.