Telugudesam: అప్పుడు ఘోషించని ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు ఘోషిస్తోందా?: డొక్కా మాణిక్య వరప్రసాద్
- పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎన్టీఆర్ క్షోభ గుర్తుకు రాలేదా?
- మీరు స్వయంగా జగన్ కాళ్ల వద్ద కూర్చున్నప్పుడు ఏమైంది?
- లక్ష్మీపార్వతిపై విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్సీ
ఎన్టీఆర్ ఆత్మ ఘోషించేలా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారన్న వైసీపీ నేత లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు, మీరు వైసీపీ చీఫ్ జగన్ కాళ్ల వద్ద కూర్చున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బతీసిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే చంద్రబాబు ఓ మెట్టుదిగి కాంగ్రెస్‌తో జతకలిశారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బతికి ఉన్నా ఇదే నిర్ణయం తీసుకుని ఉండేవారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ వీపు మీద కొడితే, బీజేపీ ఏకంగా పొట్టమీద కొట్టిందన్నారు. అందుకనే ఆ పార్టీకి వ్యతిరేకంగా ‘సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ, సేవ్ స్టేట్’ నినాదంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పైనా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఆయన ఆలోచనలు 2014 వద్దే ఆగిపోయాయని విమర్శించారు.
గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గన్ని కృష్ణ కూడా లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపై స్పందించారు. పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. లక్ష్మీ పార్వతి స్వయంగా జగన్ కాళ్ల వద్ద కూర్చున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ ఘోషించలేదా? అని ప్రశ్నించారు.