Chandrababu: కేసీఆర్‌కు షాకిచ్చిన స్టాలిన్.. చంద్రబాబుతోనే వెళ్లాలని నిర్ణయం

  • చంద్రబాబు, రాహుల్ గాంధీలను ప్రశంసించిన స్టాలిన్
  • వారిద్దరూ తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్న డీఎంకే చీఫ్
  • ఊసే  లేని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్

బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరిక ఇక ఫలించనట్టే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ అప్పట్లో స్టాలిన్ ని కలిసి మద్దతు కోరారు. దేశహితం కోసం తనతో కలిసి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే, ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఊసే లేకుండా పోయింది. కేసీఆర్ కూడా దాని గురించి ప్రస్తావించలేదు.

తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకం చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు విజయం సాధించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల ముఖ్యనేతలను కలిసి బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని తయారుచేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం దేశరాజకీయాల్లో పెను సంచలనమే అయింది.

వీరిద్దరి కలయికపై తాజాగా స్టాలిన్ స్పందించారు. రాహుల్ గాంధీ, చంద్రబాబులను ప్రశంసించారు. అవినీతి, నిరంకుశ, విభజన శక్తులు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా స్టాలిన్ వ్యాఖ్యానించారు. అందుకోసం రాహుల్ గాంధీ, చంద్రబాబు తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. వారికి కావాల్సినంత మద్దతు ఉందన్నారు.

స్టాలిన్ వ్యాఖ్యలతో ఇక తమ పయనం చంద్రబాబుతోనేనని, ఫెడరల్ ఫ్రెంట్ వైపు కాదని స్టాలిన్ స్పష్టం చేసినట్టు అయింది. ఏప్రిల్ 29న చెన్నై వెళ్లిన కేసీఆర్ డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. అప్పటికి జీవించి ఉన్న కరుణానిధిని కలిసి పరామర్శించారు. స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు. ఆ సమయంలో స్టాలిన్ కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే, తాజాగా ఫెడరల్ ఫ్రంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, జేడీఎస్ కూడా మనసు మార్చుకుని కాంగ్రెస్‌తోనే ఉండాలని నిర్ణయించుకుంది.

  • Loading...

More Telugu News