modi: మోదీ పాలనలో అభివృద్ధిపై కాకుండా.. ఈ రెండింటిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్, ఏం తింటున్నావ్ అనే విషయాలపైనే చర్చ
- ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం జరిగింది
- ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్ని కేసీఆర్ హామీ ఏమైంది?
ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మోదీ హయాంలో అభివృద్ధిపై చర్చ జరగడం లేదని... ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు, ఏం తింటున్నావు? అనే అంశాలపైనే చర్చ జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఎన్డీయే పాలనలో ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. మైనార్టీల హక్కులను మోదీ పభుత్వం కాలరాస్తోందని... అన్ని మతాలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్ అంబర్ పేటలో జరిగిన జమైతా ఉలూమా సమావేశానికి ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
మోదీకి కేసీఆర్ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రంజాన్ దావత్ ఇచ్చి, బిర్యానీ పెడితే సరిపోతుందా? అని ఎద్దేవా చేశారు.