Andhra Pradesh: ఇక కేంద్రాన్ని అడుక్కుని లాభం లేదు.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాం!: సీఎం చంద్రబాబు
- విభజన హామీలు అడిగితే ఐటీ వేధింపులు
- గతంలో దేశానికే దారి చూపాం
- సీబీఎన్ ఆర్మీ అద్భుతంగా పనిచేస్తోంది
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరితే కేంద్రం ఐటీ దాడులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఇక కేంద్రాన్ని అడుక్కుంటే లాభం లేదనీ, ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం డేగరమూడిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
గతంలో దేశానికి సమస్య వస్తే టీడీపీ దారి చూపిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ఓ రాజకీయ పార్టీ కాదనీ, అది ఓ వ్యవస్థ అని అన్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం సీబీఎన్ ఆర్మీ అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు.
రాష్ట్రంలో కోడికత్తి, జల్లికట్లు, పోలవరం కాలువలు తెగ్గొట్టడం, అసెంబ్లీకి రాకపోవడం, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయడం వంటి పనులకు ప్రతిపక్షం పరిమితమయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు తనకు ఓటేయాలని, ప్రతిగా వారి ఆదాయం, జీవనప్రమాణాలు పెంచే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.