Tamilnadu: పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ గొంతుకోసిన యువకుడు.. కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు!

  • తమిళనాడులోని తంజావూరులో దారుణం
  • వివాహానికి అంగీకరించని యువతి, తల్లిదండ్రులు
  • పగతో హత్యచేసిన ప్రబుద్ధుడు

వివాహం చేసుకునేందుకు యువతి నిరాకరించడంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఆమెను అటకాయించి మరీ కిరాతకంగా కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పాపనాశం శివాలయం వీధిలో ఉంటున్న వసంత ప్రియ(25).. కుంభకోణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో వసంత ప్రియను తనకు ఇచ్చి వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులను సమీప బంధువు నందకుమార్ కోరాడు. అయితే దీనికి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాకుండా మరో యువకుడితో వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో యువతిపై కక్ష పెంచుకున్న నందకుమార్ ఆమె రాకపోకలపై నిఘా పెట్టాడు.

ప్రియ స్కూలు నుంచి తిరిగివస్తున్న సమయంలో ఆమెను అడ్డగించి కత్తితో గొంతు కోశాడు. ఒక్కసారిగా ప్రియ నేలపై కుప్పకూలిపోవడంతో నందకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నందకుమార్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. తనతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

Tamilnadu
marriage
proposal
rejected
Police
knife
throat
sliced
vasanta priya
nandakumar
teacher
arrested
killed
murder
tanjavoor
  • Loading...

More Telugu News