Andhra Pradesh: జగన్ పై దాడికి వాడింది కోడికత్తి కాదు.. గొంతులు కోసే కత్తి!: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
- సిట్ దర్యాప్తు ముందుకెందుకు సాగడం లేదు
- దాడి ఘటనను చిన్నదిగా చూపిస్తున్నారు
- రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో సిట్ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం ఘటనను సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై దాడికి వాడింది కోడి కత్తి కాదనీ, అది గొంతులు కోసే కత్తి అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు.
దేవుడి దయవల్ల జగన్ ఈ దాడి నుంచి ప్రాణాలను దక్కించుకున్నారని సుబ్బారెడ్డి అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని వ్యాఖ్యానించారు. 2014లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసిందనీ, రాబోయే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి భారీ మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
తనను కాపాడుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రా ప్రజలను రోడ్డుపై పడేసిన కాంగ్రెస్ తో జట్టుకట్టిన టీడీపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఇంటికి సాగనంపుతారని జోస్యం చెప్పారు.