Chandrababu: చంద్రబాబు నా ఇంటికి వచ్చి అడిగితే... మద్దతు ఇచ్చేవాడిని!: పవన్ కల్యాణ్
- చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైందో.. చివరకు అక్కడికే చేరుకుంది
- ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
- జగన్ తో చేతులు కలపడానికి కూడా చంద్రబాబు సిద్ధపడతారు
జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని... ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మాట తప్పనని చెప్పారు. కాంగ్రెస్-టీడీపీల పొత్తు కేవలం ట్రైలర్ మాత్రమేనని... ఆ సినిమా ఆడే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయాణం ఎక్కడ మొదలైందో, చివరకు అక్కడకే చేరుకుందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ ను కలసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని... తన ఇంటికి వచ్చి తనను అడిగితే తానే మద్దతు ఇచ్చేవాడినని అన్నారు.
2014లో కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మలేదని... కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. తాను అడ్డంకిగా అనిపిస్తే... జగన్ తో కూడా చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధపడతారని అన్నారు. టీడీపీవాళ్లు ఇచ్చే రూ. 2 వేలు తీసుకుని జనసేనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జగన్ లా తన వద్ద లక్షల కోట్లు లేవని, చంద్రబాబులా హెరిటేజ్ ఫ్యాక్టరీలు లేవని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో స్పష్టత లేదని చెప్పారు.