Khashoggi: ‘వాషింగ్టన్ పోస్టు’ విలేకరి హత్య కేసులో హృదయ విదాకర విషయం వెలుగులోకి!
- సంచలనం సృష్టించిన ఖషోగ్గి హత్య
- శరీర భాగాలను యాసిడ్‌లో వేసి కరిగించిన నిందితులు
- మాటువేసి క్రూరంగా హతమార్చిన దుండగులు
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వాషింగ్టన్ పోస్టు’ విలేకరి జమాల్ ఖషోగ్గి (59) హత్య కేసులో విస్తుపోయే నిజం ఒకటి వెలుగు చూసింది. ఆయనను హత్య చేసిన అనంతరం అతని శరీర భాగాలను యాసిడ్‌లో వేసి పూర్తిగా కరిగించేశారని తెలిసింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్యకార్యాలయంలోనే ఈ ఘటన జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ సలహాదారు యాసిన్ అక్తాయ్ వెల్లడించారు. ఖషోగ్గిని చంపాలంటూ సౌదీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ‘వాషింగ్టన్ పోస్టు’కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
ఖషోగ్గిని పథకం ప్రకారమే, క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు. మొత్తం 18 మంది సౌదీ అరేబియన్లు ఈ హత్యలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. తన వివాహ పత్రాల కోసం ఖషోగ్గి సౌదీ రాయబార కార్యాలయానికి వస్తారని ముందే తెలుసుకున్న నిందితులు అతడిని అత్యంత క్రూరంగా చంపేశారని ఆరోపించారు. ఈ హత్యలో పాల్గొన్న వారి వివరాలను బయటపెట్టాలని సౌదీ అరేబియాను డిమాండ్ చేశారు.