Congress-Telugudesam: ఈ పొత్తు..పాము-ముంగిస కలిసినట్టుంది: మంత్రి కేటీఆర్
- ముసలినక్క, గుంటనక్క ఒక్కటయ్యారు
- ఇంతకన్నా నీచముంటుందా?
- వీళ్లు ఏ కారంణ చేత కలుస్తున్నారు?
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్లలో పద్మశాలి వస్త్ర పరిశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, ‘ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబునాయుడు ఒక్కటయ్యారు. నిన్న రాహుల్ గాంధీకి వీణ ఇచ్చాడు చంద్రబాబునాయుడు. ఈరోజు ఆ ఫొటో చూస్తే ఏమనాలో నాకు అర్థం కాలేదు.
సరే, నాకు, మీకు ఎట్లా అనిపించినా.. పాపం, స్వర్గంలో ఉన్న ఎన్టీరామారావుకు ఏమనిపించిందో! నాకు అదే బాధేసింది. ఎన్టీఆర్ బతికినప్పుడు ఒకసారి వెన్నుపోటు పొడిచాడు, చచ్చినాక మళ్లీ వెన్నుపోటు పొడిచాడు. ఇంతకన్నా నీచముంటుందా? కాంగ్రెస్, టీడీపీ కలవడమా? కలికాలంలో చిత్రవిచిత్రమైన పనులవుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇదిగో..ఇవే చిత్రవిచిత్రమైన పనులంటే. కాంగ్రెస్-టీడీపీ కలవడమంటే..పాము, ముంగిస కలిసినట్టే. వీళ్లు ఏ కారణం చేత కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? వాళ్లు ఒక్కటే చెబుతున్నారు.. ‘కేసీఆర్ ను దించాలి’ అని, కేసీఆర్ ను ఎందుకు దించాలి? నేతన్నల బతుకులు బాగుచేసినందుకు కేసీఆర్ ను దించాలా?’ అని విరుచుకుపడ్డారు.