Kodandaram: రాహుల్‌తో ముగిసిన కోదండరాం భేటీ!
- మేము 17 సీట్లు కోరాం.. 15 ఇస్తారని భావిస్తున్నాం
- అధికారం కోసమైతే ప్రయోజనం శూన్యం
- పార్టీ 25 నియోజకవర్గాల్లో బలంగా ఉంది
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం భేటీ ముగిసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు కోదండరాం తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల గురించి చర్చించామని.. తాము 17 సీట్లు కోరామని.. 15 సీట్లు తమకు కేటాయిస్తారని భావిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని రాహుల్‌ను కోరినట్టు కోదండరాం తెలిపారు.
అధికారం కోసం కూటమిగా ఏర్పడితే ప్రయోజనం శూన్యమని... లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కలిసి వచ్చే శక్తులతో పని చేసేందుకు సిద్ధమని కోదండరాం పేర్కొన్నారు. తమ పార్టీ 25 నియోజకవర్గాల్లో బలంగా ఉందని ఆయన తెలిపారు. నిరంకుశ పాలనను ఎదుర్కొనేందుకే కూటమిగా ఏర్పడుతున్నామన్నారు. సీట్ల సర్దుబాటు విషయం తేలితే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.