Telugudesam: పొత్తు పెట్టుకుందామంటే కేసీఆర్ ఒప్పుకోలేదు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • టీడీపీతో పొత్తునకు టీఆర్ఎస్ అంగీకరించలేదు
  • తెలంగాణలో పార్టీ కోసమే మహాకూటమిలో చేరిక
  • కలిసివున్న సమయంలో ఐటీ దాడులు లేవు
  • ప్రత్యర్థులు నాశనం కావాలన్నదే మోదీ ఆలోచన

తెలంగాణలో టీడీపీతో పొత్తుకు టీఆర్ఎస్ అంగీకరించలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తెరాసతో పొత్తుకు తాను ముందుకు వచ్చినప్పటికీ, కేసీఆర్ నిరాకరించారని, రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలన్నదే తన అభిమతమని తెలిపారు. ఈ ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, తెలంగాణలో టీడీపీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే మహాకూటమిలో చేరామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ అని హడావుడి చేసిన కేసీఆర్, ఆపై దాన్ని వదిలేశారని చంద్రబాబు ఆరోపించారు.

బీజేపీతో కలసి వున్న సమయంలో మనపై ఐటీ దాడులు జరగలేదని, విడిపోయిన తరువాత దాడులు చేయించి భయపెట్టాలని చూస్తున్నారని చెప్పిన చంద్రబాబు, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడలేదని అన్నారు. తన ప్రత్యర్థులంతా నాశనం కావాలన్న నిరంకుశ వైఖరితో మోదీ ఉన్నారని, ఆయన వైఖరిని ఎదిరించేందుకే ఇప్పుడు కాంగ్రెస్ తో కలసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.

వారం రోజుల వ్యవధిలో తాను రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేశానని, తన పర్యటనను దేశమంతా ఆసక్తిగా చూసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్టోబర్ 27నాటి పర్యటనతో అందరిలో నమ్మకం కలిగిందని, నిన్నటి పర్యటనతో భరోసా వచ్చిందని, ఒకరిద్దరు తప్ప అన్ని పార్టీలూ ఒకే తాటిపైకి వస్తున్నాయని అన్నారు. మిగిలిన పార్టీలతోనూ తాను సమావేశమై, అందరినీ కలిపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇదొక చారిత్రాత్మక ఉద్యమమని, కార్యకర్తలు గతాన్ని మరచి, ఒకే మాటపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు.

  • Loading...

More Telugu News