Chandrababu: రాహుల్, చంద్రబాబు కలయికపై స్పందించిన రేవంత్ రెడ్డి!
- చంద్రబాబును కలిసిన రేవంత్ రెడ్డి
- బాబు, రాహుల్ కలయికతో దేశానికి మేలు
- పాలనా వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్, మోదీ
- మీడియాతో రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నిన్న న్యూఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన వేళ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబుతో కాసేపు మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఆపై మీడియా ముందుకు వచ్చారు.
ఇండియాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, త్యాగాలు చేసిన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు కలిశారని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ఇద్దరు నాయకులు కలసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం దేశానికి మేలు కలిగిస్తుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్, ఇండియాలో మోదీ ప్రమాదకరంగా మారారని, పాలనా వ్యవస్థలను వీరు నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీడీపీ కలసి పనిచేస్తే, దేశానికి బలమైన నాయకత్వం అందుతుందని చెప్పారు. గతంలోనూ టీడీపీ ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఏకం చేసిందని గుర్తు చేశారు.