Republic: ఏపీలో వైకాపా హవా... 20 ఎంపీ సీట్లు వారికే: రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే!
- 5 సీట్లకు తెలుగుదేశం పరిమితం
- వైకాపాకు 41.2 శాతం ఓట్లు
- కేంద్రంలో మెజారిటీకి దూరంలో ఎన్డీయే
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రిపబ్లిక్ - సీ వోటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, రాష్ట్రంలోని 25 లోక్ సభ సీట్లలో 20 వైకాపా గెలుస్తుందని, టీడీపీకి 5 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. "నేషనల్ అప్రూవల్ రేటింగ్స్" పేరిట తాజా అంచనాల్ని సంస్థ విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి దగ్గరగా వస్తుందని, యూపీఏకు గతంలోకన్నా అధిక సీట్లు వస్తాయని అంచనా వేసింది.
కేరళలో ఖాతా తెరవాలని భావిస్తున్న బీజేపీకి మరోసారి చుక్కెదురవుతుందని, తమ రాష్ట్రాన్ని వరదలు పీడించినప్పుడు కేంద్రం సరిగ్గా సాయపడలేదన్న ఆగ్రహం కేరళీయుల్లో ఉందని వెల్లడించింది. దేశంలో అత్యధిక లోక్ సభ సీట్లున్న యూపీలో అఖిలేష్, మాయావతిల కారణంగా బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని పేర్కొంది.
2014 ఎన్నికల్లో ఏపీలో 2 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి, ఈ దఫా ఒక్క సీటు కూడా దక్కదని రిపబ్లిక్, సీ-వోటర్ సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే, వైఎస్ఆర్ సీపీకి 41.2, టీడీపీకి 31.2 శాతం ఓట్లు లభిస్తాయని బీజేపీ 11.3 శాతం, కాంగ్రెస్ కు 9.3 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది.