Chandrababu: ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీయేతర కూటమి అనివార్యం: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు
- సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనే దేశాభివృద్ధి జరిగింది
- మోదీకి వచ్చిన సంపూర్ణ అధిక్యంతో దేశం తిరోగమనం
ఇప్పుడు దేశంలో బీజేపీ, బీజేపీయేతర అనే రెండే వేదికలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీయేతర కూటమి అనివార్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఉన్నప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్ పేయిల ప్రభుత్వాలు సంస్కరణలకు ప్రతీకలని కొనియాడారు.
మోదీకి వచ్చిన సంపూర్ణ అధిక్యం దేశాన్ని తిరోగమనానికి తీసుకెళ్లిందని, బీజేపీ హయాంలో దేశంలోని వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని మండిపడ్డారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందని, ప్రశ్నించిన వారిపై ఐటీ దాడులు చేయిస్తున్నారని, తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయని అన్నారు. బీజేపీ దేశంలో అనైక్యతను సృష్టిస్తోందని, ప్రజలను కుల, మతాల పేరుతో విభజిస్తోందని, ఇప్పుడు దేశంలో ఐక్యత సాధించడం తమ ముందున్న కర్తవ్యమని అన్నారు.