statue of unity: ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ శిలాఫలకంపై తెలుగు భాషలో కూడా ఉంది.. టీడీపీపై నిప్పులు చెరిగిన పురందేశ్వరి!
- శిలాఫలకంపై ఉన్న ‘ఐక్య భారతం శ్రేష్ఠ భారతం’
- మోదీ అంటే మీకెందుకు మంటగా ఉందో?
- తెలుగుతల్లి బిడ్డలం.. తెలుగుదేశం బిడ్డలం కాదు
భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మృత్యర్థం ’స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని మోదీ నిన్న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో దక్షిణాది నుంచి కేవలం తమిళ భాషకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని, తెలుగు భాషకు స్థానం కల్పించలేదంటూ వార్తలు హల్ చల్ చేస్తున్న తరుణంలో బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.
ఆ శిలాఫలకంపై తెలుగు భాషకు స్థానం కల్పించలేదన్న వార్తలను ఖండిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ శిలాఫలకంపై ‘తెలుగు’,‘కన్నడ’ తదితర భాషలు ఉన్నాయని తెలియజేస్తూ శిలాఫలకం ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఐక్య భారతం శ్రేష్ఠ భారతం’ అని తెలుగులో రాసి ఉండటం గమనించవచ్చు. ఈ సందర్భంగా టీడీపీపై ఆమె నిప్పులు చెరిగారు. ‘ఆఖరికి ఆ మహానుభావుడిని కూడా మీ పచ్చ బానిసత్వానికి బలిచేశారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘ఐక్య భారతం, శ్రేష్ఠ భారతం .... స్టాట్యూ ఆఫ్ యూనిటీ
ఆఖరికి ఆ మహానుభావుడిని కూడా మీ పచ్చ బానిసత్వానికి బలిచేశారు.
వీళ్లు ఫోటో షాప్ చేసిన ఫ్రేమ్ నిజానికి 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ ' అని ఉన్న ప్లేట్.. దాని స్థానంలో వివిధ భాషల్లో గూగుల్ ట్రాన్స్ లేట్ చేసి జనం మీదకు వదిలారు పచ్చ పార్టీ. దానికి తోడు జర్నలిజం ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు దీన్ని తమతమ ఛానల్స్ లో చర్చలు పెట్టి మోదీజీ మీద ఎంత బురద చల్లాలో అంత చల్లేశారు... పైగా మేం భారతీయులం కాదా? అని ప్రశ్నలు!
ఇక్కడ పుట్టిన ఎవరైనా భారతీయులే మాకు సందేహం లేదు. భరతమాత బిడ్డ మోదీజీ అంటే మీకెందుకు మంటగా ఉందో అర్ధం కావడంలేదు. మీరు కూడా భరతమాత సంతానమే. 'ఏదైనా గొప్ప పని చేస్తే ముద్దుబిడ్డ అంటాం'. ఒక వ్యక్తి మీద అకారణ ద్వేషంతో రగిలిపోయేవాడ్ని అనం. తెలుగుతల్లి బిడ్డలం.. తెలుగుదేశం బిడ్డలం కాదు. ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు? దాని గురించి మీ మీ ఛానల్స్ లో ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు? జాబ్ శాటిస్ఫాక్షన్ అనేది ఒకటుంటుంది..మనస్సాక్షి అనేది కూడా ఒకటుంటుంది’ అని తన పోస్ట్ లో పురందేశ్వరి పేర్కొన్నారు.