Andhra Pradesh: తాను కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకోలేదని.. కుమార్తెను కడతేర్చిన తండ్రి!

  • ప్రకాశం జిల్లా కొమరోలులో ఘటన
  • బావతో నిశ్చితార్థం చేసిన కుటుంబ సభ్యులు
  • వివాహానికి ససేమిరా అన్న యువతి

కన్నతండ్రే కాల యముడిగా మారాడు. తాను తెచ్చిన పెళ్లి సంబంధం చేసుకోనందుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. కన్నబిడ్డను గొంతు నులిమి చంపడంతో పాటు చివరికి సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని దహనం చేశాడు. చివరికి గ్రామస్తుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు తండ్రిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని నాగిరెడ్డి పల్లికి చెందిన పందరబోయిన ఆవులయ్య బీఎస్ఎఫ్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెట్రో రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఇంద్రజ(20)కు తన సోదరి కుమారుడితో నిశ్చితార్థం చేశాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఇంద్రజ గత 10 రోజులుగా భోజనం తినకుండా అలిగి కూర్చుంది. ఇది తెలుసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన ఆవులయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నేను తెచ్చిన పెళ్లి సంబంధాన్నేకాదంటావా?’ అంటూ రెండు చేతులతో ఆమె గొంతును గట్టిగా నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచంతో పాటు ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే తెల్లవారే వరకూ అది కాలుతూ ఉండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు ఆవులయ్య, అతని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణలో తానే కుమార్తెను హత్య చేసినట్లు ఆవులయ్య అంగీకరించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

Andhra Pradesh
Prakasam District
marriage
opposed
killed
by father
tourched
burned
corpse
dead body
  • Loading...

More Telugu News