Uttar Pradesh: పిల్లను ఇస్తామని ఇంటికి పిలిపించి.. కిరోసిన్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు!

  • ఉత్తరప్రదేశ్ లోని ఈటాలో ఘటన
  • కొనప్రాణాలతో ఉన్న యువకుడు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రేమించిన యువతిని ఇచ్చి వివాహం చేస్తామని నమ్మబలికిన అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిపై దారుణానికి తెగబడ్డారు. తమ కూతురిని ప్రేమించాడన్న కోపంతో మంచానికి కట్టేసి సజీవదహనం చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఈటాలో చోటుచేసుకుంది.

యూపీలోని ఈటా ప్రాంతానికి చెందిన నరేంద్ర శాక్యా(22) ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అలీగంజ్ ప్రాంతానికి చెందిన రష్మిక అనే యువతితో నరేంద్రకు పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ ఇళ్లలో వీరిద్దరు ప్రేమ విషయం చెప్పకముందే రష్మిక ఇంట్లో ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది. దీంతో రష్మిక తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. నరేంద్రను చంపేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో పెళ్లి విషయం మాట్లాడటానికి రావాల్సిందిగా నరేంద్రను ఆహ్వానించాడు. ఇదంతా నిజమని నమ్మిన ఆ యువకుడు ఒంటరిగా రష్మిక ఇంటికి వెళ్లాడు. దీంతో నరేంద్రను చుట్టుముట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు కర్రలు, రాడ్డులతో విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం ఓ చీకటి గదిలో బంధించారు. అప్పటికీ కోపం చల్లారకపోవడంతో ఓ మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో బాధితుడి హాహాకారాలు విన్న చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. హత్యాయత్నానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశామనీ, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. నరేంద్రకు 90 శాతం కాలిన గాయాలు అయ్యాయనీ, అతను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని పేర్కొన్నారు.

Uttar Pradesh
murder
fir
tourched
Police
eata
daughter
love
angry
family
hospital
ICU
  • Loading...

More Telugu News